V6 News

బెంగాల్‎లో కాంగ్రెస్ కార్యకర్త దారుణ హత్య.. సీఎం మమతపై రాహుల్ గాంధీ ఫైర్

బెంగాల్‎లో కాంగ్రెస్ కార్యకర్త దారుణ హత్య.. సీఎం మమతపై రాహుల్ గాంధీ ఫైర్

కోల్‎కతా: అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‎లో కాంగ్రెస్ కార్యకర్త దారుణ హత్యకు గురి కావడంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన రాహుల్.. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ, ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో టీఎంసీ భీభత్స పాలనను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. 

ప్రభుత్వ వ్యతిరేక స్వరాలను టీఎంసీ భయభ్రాంతులకు గురి చేస్తోందని.. ఇదివారికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో మంది కార్యకర్తలను కోల్పోయింది.. కానీ ఏ రోజు హింసా మార్గాన్ని ఎంచుకోలేదు. అహింసా, రాజ్యాంగాన్నే ఎంచుకున్నాము. ఇదే మా వారసత్వం. ఇదే మా సంకల్పమని అన్నారు. కాంగ్రెస్ రాజకీయాలు ఎన్నడూ హింసపై ఆధారపడలేదు.. భవిష్యత్తులోనూ ఆధారపడవని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ కార్యకర్తను హత్య చేసిన నిందితులందరినీ తక్షణమే అరెస్టు చేసి వారికి అత్యంత కఠిన శిక్ష విధించడంతో పాటు మృతుడి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భారతదేశ అహింసా సంప్రదాయాన్ని మలినం చేసే ఈ రాజకీయాలకు కాంగ్రెస్ ఎన్నటికీ తలొగ్గబోదని నొక్కి చెప్పారు. 

అసన్‎సోల్‎లో కాంగ్రెస్ కార్యకర్త దారుణ హత్య:

రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ ముగిసిన తర్వాత అసన్‌సోల్‌లో కాంగ్రెస్ కార్యకర్త దేబ్‌దీప్ ఛటర్జీ దారుణంగా హత్యకు గురయ్యాడు. అసన్‌సోల్ నార్త్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి ప్రసేన్‌జిత్ పుయిటాండిమ్‌తో ఛటర్జీ సన్నిహితంగా ఉండేవాడు.
దేబ్‌దీప్ ఛటర్జీ హత్యకు టీఎంసీ కార్యకర్తలే కారణమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దేబ్‌దీప్ ఛటర్జీపై టీఎంసీ కార్యకర్తలు విచక్షణరహితంగా దాడి చేశారని.. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి మరణించాడని ఆరోపించింది.